- నమస్తే న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు.. ఆకేరు ఆనకట్టలపై క్షేత్రస్థాయి పరిశీలన.
- ఆకేరు ఆనకట్టల దుస్థితిపై కదిలిన జిల్లా యంత్రాంగం.. మరమ్మతుల నివేదికకు డీఈ ఆదేశాలు.
- నమస్తే న్యూస్ కథనం ఫలితం.. ఆకేరు చెక్‌డ్యాంలను పరిశీలించిన జిల్లా నీటిపారుదల అధికారులు.
- ఆకేరు ఆనకట్టల పునరుద్ధరణకు తొలి అడుగు.
నర్సింహులపేట, జూలై 10 (నమస్తే న్యూస్)
“శిథిలావస్థలో ఆకేరు ఆనకట్టలు..! రైతన్నకు తీరని సాగునీటి కష్టాలు..!” అనే శీర్షికతో నమస్తే న్యూస్‌లో ప్రచురితమైన ప్రత్యేక కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఆకేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలు, ఆనకట్టలను జిల్లా నీటిపారుదల శాఖ డీఈ లక్ష్మణ్‌రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఆకేరు పర్యాటక ప్రాంతంతో పాటు వాగుపై ఉన్న చెక్‌డ్యాంల పరిస్థితి, శిథిలావస్థ, నీటి నిల్వ సామర్థ్యం, మరమ్మతుల అవసరాన్ని డీఈ లక్ష్మణ్‌రావు సంబంధిత అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఆనకట్టల పునరుద్ధరణకు అవసరమైన సాంకేతిక వివరాలను సేకరించి సమగ్ర నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆనకట్టలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో వర్షాకాలంలో నిల్వ చేయాల్సిన నీరు వృథాగా దిగువకు పారిపోతోందని, దీనివల్ల పరిసర గ్రామాల రైతులు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు స్థానికంగా వివరాలు తెలుసుకున్నారు.ఆనకట్టలకు మరమ్మతులు చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచితే వందలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలమట్టం కూడా పెరిగి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.నమస్తే న్యూస్ లో ప్రచురితమైన కథనానికి వెంటనే స్పందించి జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించడం పట్ల స్థానిక రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న నమస్తే న్యూస్ కు అభినందనలు తెలిపారు.ఈ పరిశీలనలో ఏఈలు గిరిధర్, శ్రీకాంత్, వంశీ, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
