
తొర్రూరు, జూలై 19 (నమస్తే న్యూస్): తొర్రూరు పట్టణ 10వ వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో, న్యూ లైఫ్ లైన్ హాస్పిటల్, తొర్రూరు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. “ప్రజల ఆరోగ్యమే నిజమైన సంపద. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. సమయానుకూలంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి నివారించవచ్చు. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న న్యూ లైఫ్ లైన్ హాస్పిటల్ యాజమాన్యం అభినందనీయమైన సేవలు అందిస్తోంది” అని పేర్కొన్నారు. శిబిరంలో డా. సురేష్ (ఎం.డి., జనరల్ ఫిజీషియన్) మరియు షుగర్ వ్యాధి నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల సాధారణ ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలు అందించారు. అలాగే ప్రజలకు ఉచిత రక్తపోటు (బీపీ), షుగర్ పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఉచిత మందులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రజలందరూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని మున్సిపల్ చైర్మన్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
