పిండిప్రోలు గ్రామంలో బొడ్రాయి ముత్యాలమ్మ వరకు జల బిందెలతో మహిళలు భారీ ర్యాలీ


తిరుమలాయపాలెం జూలై 15 (నమస్తే న్యూస్)
మండలంలోని పిండిప్రోలు గ్రామంలో వరుణ దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ పిండిప్రోలు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కామల్ల సువార్త ఉపసర్పంచ్ చామకూరి రాజు పాలకమండల ఆధ్వర్యంలో గ్రామదేవతలకు భక్తిశ్రద్ధలతో జలాభిషేకం నిర్వహించారు. గ్రామంలోని మహిళలు, యువతులు తలపై జల బిందెలను మోసుకుంటూ గ్రామ వీధుల గుండా భారీ ర్యాలీగా బొడ్రాయి ముత్యాలమ్మ ఆలయం వరకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద మహిళల కోలాటం ఆటపాటలతో నృత్యాలతో వరణదేవుని వేడుకున్నారు. అనంతరం గ్రామదేవతలకు జలాభిషేకం చేసి, వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు నిండాలని, రైతుల పొలాలు పచ్చని పంటలతో కళకళలాడాలని, ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, మంచి వర్షాలు కురిసి వ్యవసాయం అభివృద్ధి చెందాలని, ప్రతి రైతు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్థులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో గ్రామదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మాధవి, గ్రామ పెద్దలు వార్డు సభ్యులు కాంపాటి ప్రమీల, పులుగుజ్జు ఉపేంద్ర, పసలాది ముత్తయ్య, చామకూరి రేణుక, గోకినపల్లి సరోజిని, రైతులు చల్ల వెంకటేశ్వర్లు, పద్మనాభుల సుధాకర్, తాతా రవీందర్, చామకూరి కిరణ్, మాజీ సర్పంచ్ అంగడి వీరస్వామి, మాజీ ఎంపీటీసీ పులుగుజ్జు వెంకటేశ్వర్లు, చామకూరి వెంకన్న, చామకూరి వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.
