డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతిని ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు
నర్సింహులపేట, జూలై 6 (నమస్తే న్యూస్)
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ జాతీయవాది డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా సోమవారం నర్సింహులపేట మండలంలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు సూరబోయిన సతీష్ మాట్లాడుతూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ దేశభక్తి, జాతీయ సమైక్యత, ప్రజాసేవ పట్ల చూపిన అంకితభావం నేటి తరానికి ఆదర్శమని అన్నారు. “ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు విధానాలు ఉండరాదు” అనే ఆయన సంకల్పం దేశ సమైక్యతను బలోపేతం చేయడంలో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి కార్యకర్త ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, మెరుగు యాకయ్య, శారదా రెడ్డి, బానోత్ రమేష్, ఉమేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
