- మూడేళ్లుగా మరమ్మతులకు నోచని చెక్‌డ్యామ్‌లు
- గండ్లు పడిన కాలువలు..వృథాగా పోతున్న సాగునీరు
- రూ.18 కోట్ల ప్రతిపాదనలు పంపినా ముందుకు కదలని పనులు
- పునరుద్ధరణ జరిగితే 2,500 ఎకరాలకు సాగునీటి ఊరట
నర్సింహులపేట, జూలై 9 (నమస్తే న్యూస్):
దశాబ్దాలుగా వేలాది ఎకరాలకు జీవనాడిగా నిలిచిన ఆకేరు ఆనకట్టలు నేడు శిథిలావస్థకు చేరుకుని రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ–మదనతుర్తి, చిన్నగూడూరు–ఉగ్గంపల్లి గ్రామాల మధ్య ఆకేరు వాగుపై 1964లో నిర్మించిన ఆనకట్టలు వరుస వరదలతో దెబ్బతిన్నా ఇప్పటివరకు శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడంతో సాగునీటి సరఫరా తీవ్రంగా దెబ్బతింది.
మూడేళ్లుగా ఆనకట్టలు,కాలువలు దెబ్బతిన్న పరిస్థితిలోనే ఉండటంతో రైతులు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాలువలు పూడిపోవడం, గండ్లు పడటం, పలు చోట్ల ఆక్రమణలు జరగడంతో విడుదలయ్యే నీరు పొలాలకు చేరకముందే వృథాగా పోతున్న పరిస్థితి నెలకొంది.ఆనకట్టలు, కాలువలను పునరుద్ధరిస్తే సుమారు 2,500 ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రైతులకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వెంటనే మరమ్మతు పనులు చేపట్టి రైతులకు సాగునీరు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.ఈ విషయంపై మరిపెడ నీటిపారుదల శాఖ డీఈ లక్ష్మణరావు మాట్లాడుతూ,ఆకేరు ఆనకట్టల పునరుద్ధరణకు సుమారు రూ.18 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. పరిపాలనా అనుమతులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించారు. రైతులు మాత్రం ప్రతిపాదనలకే పరిమితం కాకుండా పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
