- యూరియా యాపును వెంటనే రద్దు చేయాలి.
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ డిమాండ్.
డోర్నకల్/మరిపెడ(జులై 11)నమస్తే న్యూస్.
మహబూబాబాద్ జిల్లా,మరిపెడ మండల కేంద్రంలోని స్థానిక ప్రజా సంఘాల భవనంలో సీపీఐ(ఎం)మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ మాట్లాడుతూ,రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న యూరియా ఎరువుల బుకింగ్ యాపు రైతులకు మరణ శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రోజురోజుకు రైతులకు ఇచ్చే రాయితీలను క్రమంగా తగ్గిస్తున్నాయని,అదే సమయంలో పురుగు మందులు,ఎరువుల ధరలను విపరీతంగా పెంచుతున్నాయని ఆయన విమర్శించారు.గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎరువుల బస్తా ధర ఒక్కొక్కటి సుమారు 450 నుండి 550 రూపాయల వరకు పెరిగిందని తెలిపారు.దీంతో రైతులు వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో వ్యవసాయ శాఖ ద్వారా గడ్డపార నుండి ట్రాక్టర్ వరకు పలు వ్యవసాయ పరికరాలను రాయితీపై అందించేవారని,కానీ ఇప్పుడు ఒక్క పరికరం కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు.అదేవిధంగా ఖరీఫ్ సీజన్లో పచ్చిరొట్టె కోసం జీలుగు,పిల్లి పెసర విత్తనాలను ప్రభుత్వమే ఉచితంగా ఇచ్చేదని,ప్రస్తుతం ఆ పథకాలన్నీ పూర్తిగా నిలిపివేశారని గుర్తు చేశారు.
వ్యవసాయాన్ని పెద్ద కంపెనీల చేతిలో పెట్టే కుట్ర
వ్యవసాయాన్ని పూర్తిగా పెద్ద కంపెనీల చేతుల్లో పెట్టే దిశగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని ఆయన ఆరోపించారు.అందులో భాగంగానే యూరియా యాపు బుకింగ్ పద్ధతి తీసుకువచ్చారని పేర్కొన్నారు.దీనివల్ల రైతులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారని అన్నారు.రాష్ట్రంలో దాదాపు 60 శాతం మంది రైతులు చదువుకోని వారు.వారికి మొబైల్ యాపులు ఎలా తెరవాలి,ఎలా బుక్ చేసుకోవాలి అనేది అర్థం కావడం లేదని వివరించారు.ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు అవసరమైన మోతాదులో యూరియాను ఎటువంటి ఆంక్షలు లేకుండా పూర్తిస్థాయిలో అందించాలని డిమాండ్ చేశారు.గతంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పెద్ద కంపెనీలకు అప్పగించేందుకు తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్,హర్యానా,ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్ రైతులు 13 నెలల పాటు ఢిల్లీ చుట్టూ ఉద్యమం చేసి,700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినా వెనక్కి తగ్గలేదని,చివరికి చట్టాలను వెనక్కి తీసుకునేలా విజయం సాధించారని గుర్తు చేశారు.రైతుల జోలికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వస్తే తెలంగాణలోనూ బలమైన ప్రజా ఉద్యమం తప్పదని గుండగాని మధుసూదన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు…
