గ్రామాల అభివృద్ధికి సర్పంచులు-కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలి: మంత్రి సీతక్క
మహబూబాబాద్, జూలై 8 (నమస్తే న్యూస్): గ్రామాల సమగ్రాభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాదని, కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామ కార్యదర్శులతో సమన్వయంగా పనిచేసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థంగా అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పిలుపునిచ్చారు.
మహబూబాబాద్‌లోని ఆర్సీ కన్వెన్షన్ హాలులో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) శిక్షణ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలోని 482 మంది సర్పంచులు, 405 మంది గ్రామ కార్యదర్శులకు పంచాయతీరాజ్ చట్టం, గ్రామాభివృద్ధి ప్రణాళికలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జూలై 8 నుంచి 10 వరకు మండల, డివిజన్ స్థాయిల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామస్థాయిలో తాగునీరు, పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, విద్యుత్, పాఠశాలలు, ఉపాధి హామీ పనులు, అంతర్గత రహదారులు తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని సూచించారు. పనుల పురోగతిని డ్యాష్‌బోర్డులో నమోదు చేసి ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని అధికారులకు ఆదేశించారు.
15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామపంచాయతీల ఖాతాల్లో జమయ్యాయని పేర్కొన్న మంత్రి, వాటిని పారదర్శకంగా వినియోగించాలని సూచించారు. గ్రామాల్లో మహిళా భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, నీటి కుంటలు, పంట కుంటలు, ఊట కుంటల నిర్మాణం, జలసిరి కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. వీధి కుక్కల సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్రామాల అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని, గ్రామసభల ద్వారా ప్రజల అవసరాలను గుర్తించి పనులను చేపట్టాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఆదర్శ గ్రామాల ఎంపికలో పది అభివృద్ధి సూచికలను పరిగణనలోకి తీసుకుంటారని, ఉత్తమ పనితీరు కనబరిచిన గ్రామాలకు అదనపు నిధులు లభిస్తాయని తెలిపారు. ప్రభుత్వ నిధులను న్యాయబద్ధంగా ఖర్చు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని సర్పంచులకు సూచించారు.
పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో ఎక్కువ పని దినాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని కోరారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి గ్రామానికి ఊట కుంట ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక అవసరాల మేరకు ఓపెన్ వెల్స్, బోరుబావుల మంజూరుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్యం, పోషకాహారం, వీధి దీపాలు, మహిళా సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ గ్రామాభివృద్ధి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గ్రామపంచాయతీ అనుమతి లేకుండా ఎలాంటి నిధులు ఖర్చు చేయరాదని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్, పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ, డీఆర్డీఓ పీడీ మధుసూదన్‌రాజు, జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




