- జి.ఓ.25 నిబంధనలను మార్చాలి,అశాస్త్రీయ సర్దుబాటు ప్రక్రియను నిలుపుదల చేయాలి.
- టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు బలాష్టి రమేష్ డిమాండ్.
డోర్నకల్/మరిపెడ(జులై 09)నమస్తే న్యూస్.
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) దంతాలపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.దంతాలపల్లి మండలంలోని అన్ని పాఠశాలలను సందర్శిస్తూ ఉపాధ్యాయుల సమస్యల సేకరణ,ప్రభుత్వ పాఠశాలల సమస్యల సేకరణతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల శాఖ అధ్యక్షులు తాలూరి రవీందర్ ఆధ్వర్యంలో చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు బలాష్టి రమేష్ మాట్లాడుతూ..”తరగతికి ఒక గది,తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండి విద్యార్థులను,వారి తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించాల్సి ఉండగా,అశాస్త్రీయమైన జి.ఓ.25ని అమలు చేయాలని పాఠశాల విద్యా సంచాలకులు జిల్లా కలెక్టర్లను ఆదేశించడాన్ని టిపిటిఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది” అన్నారు.ప్రాథమిక పాఠశాలలో 11 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు,అదే విధంగా 60 మంది విద్యార్థులకు కూడా ఇద్దరే ఉపాధ్యాయులను కేటాయించాలని పేర్కొనడం అసంబద్ధమన్నారు.
టిపిటిఎఫ్ ప్రధాన డిమాండ్లు:
– ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి
– 40 మంది వరకు ఇద్దరు, 60 మంది వరకు ముగ్గురు ఉపాధ్యాయులను కేటాయించాలి
– ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుని చొప్పున నియమించాలి
– ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిని నియమించాలి
– ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుండి మినహాయించాలి
నేటి సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉన్నత పాఠశాలల్లో ప్రతి 25 మంది విద్యార్థులకు ఒక సెక్షన్‌గా పరిగణించి జి.ఓ.25ను సవరించాలి.
జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు భారంగా మారిన సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని,ఈహెచ్ఎస్ విధివిధానాలను వెంటనే వెలువరించాలని,ఆశ్రమ,గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తాలూరి రవీందర్,మండల ప్రధాన కార్యదర్శి చింతల సురేష్,టిపిటిఎఫ్ సీనియర్ నాయకులు సురేంద్ర గుప్తా,మాదాసు రాములు,పరంకుశ చారి,కొంపెల్లి రామయ్య,రుద్రమరాజు,యాకన్న తదితరులు పాల్గొన్నారు…

