‘చెప్పిందే చేస్తాం.. రైతు భరోసా విడుదల చేశాం’
: సీఎం రేవంత్ రెడ్డి.
- 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి
- తొలి విడతలో 41.37 లక్షల మందికి రూ.2,482 కోట్ల జమ
- వ్యవసాయంపై 30 నెలల్లో రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేశాం.
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
హైదరాబాద్,జూన్ 30 (నమస్తే న్యూస్ డెస్క్): “చెప్పిందే చేస్తాం.. చేసినదే చెబుతాం. రైతులు ఆత్మగౌరవంతో సాగు చేసేలా వ్యవసాయాన్ని పండుగగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం” అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను మంగళవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో విడుదల చేశారు. కంప్యూటర్ మీట నొక్కి తొలి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించారు.తొలి విడతలో 41.37 లక్షల మంది రైతులకు రూ.2,482.02 కోట్లను విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే తొమ్మిది రోజుల్లో మొత్తం రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.
గత 30 నెలల్లో వ్యవసాయ రంగంపై రూ.1.75 లక్షల కోట్లను ఖర్చు చేశామని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 25.35 లక్షల మంది రైతులకు రూ.20,677 కోట్ల రుణమాఫీ అమలు చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చెల్లించని రూ.7 వేల కోట్ల రైతు భరోసా బకాయిలను చెల్లించామని, రైతు భరోసా మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచామని తెలిపారు. ఇప్పటివరకు రైతు భరోసా కింద రూ.27 వేల కోట్లకు పైగా చెల్లించామని, తాజా విడతతో కలిపి మొత్తం రూ.36 వేల కోట్లకు చేరిందన్నారు.
పంటలకు బోనస్‌గా రూ.4 వేల కోట్లు, వ్యవసాయ పనిముట్లకు రూ.2 వేల కోట్లు, పంటల బీమాకు రూ.3,500 కోట్లు చెల్లించామని తెలిపారు. రెండున్నరేళ్లలో వరి కొనుగోళ్ల కోసం రూ.80 వేల కోట్లకు పైగా రైతులకు చెల్లించామని చెప్పారు.గత ప్రభుత్వం పదేళ్లలో వ్యవసాయంపై రూ.1.6 లక్షల కోట్లు ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వం కేవలం 30 నెలల్లోనే రూ.1.75 లక్షల కోట్లు వెచ్చించిందన్నారు. వ్యవసాయ రంగానికి నెలకు సగటున రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడే నాటికి రూ.69 వేల కోట్ల అప్పు ఉండగా, గత ప్రభుత్వ హయాంలో అది రూ.8.11 లక్షల కోట్లకు పెరిగిందని ఆరోపించారు. అప్పుల భారం మధ్యే ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినా ఉద్యోగులకు ప్రతి నెల తొలి తేదీన జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు.తెలంగాణ ఈ ఏడాది 2.88 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో దేశంలోనే తొలి స్థానంలో నిలిచిందన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు పంట మార్పిడిపై దృష్టి పెట్టాలని సూచించారు.అబద్ధాల పునాదులపై ప్రభుత్వం నడవదు. ఉన్నది ఉన్నట్టే చెబుతాం. మాట ఇస్తే నిలబెడతాం. రైతుల ప్రభుత్వం రైతుల కోసమే పనిచేస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
